తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతిష్ఠాత్మక ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని ఇకపై పట్టణాలకు కూడా వర్తింపజేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా, తక్కువ స్థలం ఉన్నవారు సైతం సొంతింటి కలను నెరవేర్చుకునేలా జీ ప్లస్ 1 (గ్రౌండ్ + ఫస్ట్ ఫ్లోర్) పద్ధతిలో ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బుధవారం జీవో 69ను జారీ చేసింది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన ఈ పథకం, తాజా నిర్ణయంతో పట్టణ వాసులకు సైతం అందుబాటులోకి రానుంది.
బుధవారం సచివాలయంలో ఈ పథకంపై సమీక్ష నిర్వహించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఈ వివరాలను వెల్లడించారు. పట్టణాల్లో స్థలాల కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ సడలింపులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. “400 చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నా, కనీసం 30 చదరపు మీటర్ల (323 చ.అ.) విస్తీర్ణంలో జీ ప్లస్ 1 విధానంలో ఇల్లు కట్టుకోవచ్చు. దీని ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్‌లో 200, మొదటి అంతస్తులో 200 చదరపు అడుగుల చొప్పున నిర్మాణం చేపట్టవచ్చు” అని ఆయన వివరించారు.
పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. “పట్టణాల్లో చాలామంది 60 గజాల కంటే తక్కువ స్థలంలో రేకుల షెడ్లలో నివసిస్తున్నారు. వారికి పక్కా ఆర్సీసీ ఇల్లు అందించాలనే ఉద్దేశంతోనే జీ+1 నిర్మాణాలకు అనుమతి ఇచ్చాం. ఈ నిర్ణయంతో పట్టణాల్లోని మురికివాడల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ జీ+1 విధానంలో ఇంటి నిర్మాణానికి కూడా ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ మొత్తాన్ని నాలుగు దశల్లో లబ్ధిదారులకు అందజేయనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. బేస్‌మెంట్ లెవల్, రూఫ్ లెవల్, మొదటి అంతస్తు నిర్మాణం, ఇల్లు పూర్తయ్యాక విడతలవారీగా ఈ సాయం అందుతుంది. జీ+1 పద్ధతిలో నిర్మించే ఇంట్లో కనీసం రెండు గదులు, ఒక వంటగది, ప్రత్యేక మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్సీసీ స్లాబ్‌తో నిర్మించే ఈ నిర్మాణాలకు హౌసింగ్ శాఖ డీఈఈ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పొందుపరిచారు.