దేశ సమగ్రత, ఐక్యతను కాపాడటం కోసం గాంధీ కుటుంబం చేసిన ప్రాణత్యాగాలు చిరస్మరణీయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని చారిత్రాత్మక చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశంలో అన్ని మతాల ప్రజలు కలసిమెలసి జీవించడం స్ఫూర్తిదాయకమని, ఈ స్ఫూర్తికి గాంధీ కుటుంబం ఒక ప్రతీక అని కొనియాడారు. “గత 35 ఏళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతున్న రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర మన దేశ సారాంశాన్ని చాటుతోంది” అని ఆయన పేర్కొన్నారు.
బ్రిటిష్ పాలనపై మహాత్మా గాంధీ జరిపిన పోరాటాన్ని గుర్తుచేస్తూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది కాలానికే ఆయనను హత్య చేసిన శక్తులు.. బ్రిటిష్ వారి కన్నా అత్యంత ప్రమాదకరమైనవని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదేవిధంగా, దేశాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నంలో ఇందిరా గాంధీ తన ప్రాణాలను అర్పించారని ఆయన గుర్తు చేసుకున్నారు.
రాహుల్ గాంధీ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, రాష్ట్రంలో కుల గణన ప్రక్రియ కూడా కొనసాగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలోనే శాసనసభ్యుల అర్హత వయసును 21 ఏళ్లకు తగ్గించేందుకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు