హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్ యాదవ్‌కు మద్దతు ఇవ్వాలని సీపీఎం పార్టీని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం జరుగుతున్న పోరాటంలోనూ ప్రభుత్వంతో కలిసి రావాలని ఆయన సూచించారు.
హైదరాబాద్‌లోని సీపీఎం కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో మహేశ్‌కుమార్ గౌడ్ నిన్న సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విజ్ఞప్తిపై జాన్ వెస్లీ స్పందిస్తూ నగర కమిటీ స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని, ఈ నెల 20న జరిగే పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ విషయంపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని జాన్ వెస్లీ తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఎం నేత సూచించగా, ఈ ప్రతిపాదనపై మహేశ్‌కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, టి. జ్యోతి, టి. సాగర్, మల్లు లక్ష్మి, అబ్బాస్, బండారు రవికుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.