షాపింగ్ కోసమో, కొత్త ఫోన్ కొనడానికో లేక సూపర్ మార్కెట్లో సరుకులు కొనడానికో, బిల్లులు చెల్లించేందుకో క్రెడిట్ కార్డు ఉపయోగించడం సాధారణమే. క్రెడిట్ కార్డు ఉందని ఎడాపెడా ఖర్చు చేసి నెలాఖరున చెల్లించలేక తలపట్టుకునే వారు కోకొల్లలు.. అయితే, ఓ వ్యక్తి మాత్రం ఈ కార్డులతోనే లక్షల్లో సంపాదిస్తున్నాడు. అతడి దగ్గర ఒకటీ రెండు కాదు.. ఏకంగా 1,638 క్రెడిట్ కార్డులు ఉన్నాయి. అన్నీ పనిచేస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యధిక క్రెడిట్ కార్డులు పొందిన వ్యక్తిగా ఏకంగా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించిన ఆ వ్యక్తి మన భారతీయుడే.. పేరు మనీశ్ ధమేజా. ఇన్ని వందల కార్డులు ఉన్నాయని మనీశ్ కు ఎంత అప్పు ఉందో అనుకుంటే పొరపాటే. ఒక్క కార్డుపైనా ఒక్క రూపాయి కూడా అప్పులేదు. ఎప్పటికప్పుడు అప్పు చెల్లించేస్తాడు. ఖర్చు పెట్టేందుకు బ్యాంకులు ఇచ్చిన కార్డులతోనే లక్షల్లో సంపాదిస్తున్నాడు. క్రమం తప్పని పేమెంట్లు చేసినందుకు సదరు కార్డుల ద్వారా వచ్చే రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్ లతో పాటు ట్రావెల్ ఆఫర్లు, ఫ్లిఫ్ కార్ట్, అమేజాన్ వంటి సంస్థలు ఇచ్చే ఆఫర్లను తాను వాడుకోవడంతో పాటు ఇతరులకు అమ్ముతూ సంపాదించుకుంటున్నాడు.
ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఏటీఎంలు, బ్యాంకుల ముందు జనం బారులు తీరిన సంగతి తెలిసిందే. అదిగో అప్పుడే తాను క్రెడిట్ కార్డుల వైపు మొగ్గుచూపానని మనీశ్ చెప్పారు. ఇప్పుడు క్రెడిట్ కార్డులు తన జీవితంలో భాగమైపోయాయని, అవిలేని జీవితాన్ని ఊహించలేనని చెప్పుకొచ్చాడు. సరైన ప్లానింగ్ తో కార్డులను వాడుకుంటూ ఆర్థిక క్రమశిక్షణతో జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు.