ఖమ్మం జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో దారుణ ఘటన జరిగింది. తొమ్మిదో తరగతి విద్యార్థిపై మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో పోక్సో కేసు నమోదవడంతో, సదరు ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొణిజర్ల మండల పరిధిలో సోమవారం వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన అరిగెల ప్రభాకర్‌రావు (46) కొణిజర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిపై మూడేళ్లుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించడంతో బాలుడు భయపడి మౌనంగా ఉండిపోయాడు.
ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన బాలుడు, తిరిగి పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించాడు. తల్లిదండ్రులు ఎంత అడిగినా కారణం చెప్పలేదు. చివరకు గట్టిగా నిలదీయడంతో ఉపాధ్యాయుడు తన పట్ల ప్రవర్తిస్తున్న తీరును వివరించాడు. దీంతో బాలుడి తండ్రి ఆదివారం రాత్రి కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ప్రభాకర్‌రావుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ విషయం తెలియగానే పాఠశాల ప్రిన్సిపల్ ప్రభాకర్‌రావును మందలించారని, దీంతో అతను తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సమాచారం. తనపై కేసు నమోదైందని తెలుసుకున్న ప్రభాకర్‌రావు తీవ్ర మనస్తాపంతో ఆదివారం రాత్రి తన స్వగ్రామంలోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద పురుగులమందు తాగాడు. అనంతరం కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని మధిరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం ప్రభాకర్‌రావు మృతిచెందాడు.