ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధమవుతోంది. ఇటీవలే ఆసియా కప్ (టీ20 ఫార్మాట్) గెలిచినప్పటికీ, ఈ సిరీస్‌పైనే అందరి దృష్టి నెలకొంది. దీనికి ప్రధాన కారణం.. సీనియర్ స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావడం, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో ఆడనుండటమే. ఈ నేపథ్యంలో టీమిండియా కొత్త కెప్టెన్ గిల్‌కు మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ కీలక సలహా ఇచ్చాడు.
జట్టులోని సీనియర్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను మేనేజ్ చేయడంపై అనవసరంగా దృష్టి పెట్టి తన శక్తిని వృథా చేసుకోవద్దని గిల్‌కు పార్థివ్ సూచించాడు. ఆ ఇద్దరూ ఎంతో అనుభవజ్ఞులని, జట్టులో తమ పాత్ర ఏమిటో వారికి బాగా తెలుసని అభిప్రాయపడ్డాడు. పీటీఐతో మాట్లాడుతూ పార్థివ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
“విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల వ్యక్తిత్వాలను బట్టి చూస్తే గిల్‌కు ఎలాంటి సమస్య ఉండదని నేను భావిస్తున్నా. మహేంద్ర సింగ్ ధోనీ ఇంకా జట్టులో ఆడుతున్న సమయంలోనే విరాట్ కెప్టెన్ అయ్యాడు. ఒక కొత్త కెప్టెన్‌ను తీర్చిదిద్దడంలో సీనియర్ ఆటగాడి పాత్ర ఎలా ఉంటుందో అతనికి తెలుసు” అని పార్థివ్ వివరించాడు. ఇదే విషయం రోహిత్ కెప్టెన్ అయినప్పుడు కూడా వర్తిస్తుందని ఆయన గుర్తుచేశాడు.
“రోహిత్ కెప్టెన్ అయినప్పుడు కోహ్లీ అతనికంటే సీనియర్ కాకపోయినా, మాజీ కెప్టెన్ హోదాలో ఉన్నాడు. భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలను వాళ్లిద్దరూ అర్థం చేసుకోగలరు. వాళ్లిద్దరూ ఎప్పుడూ ఎంతో పరిణతితో వ్యవహరిస్తారు. కాబట్టి ఆ సీనియర్లను మేనేజ్ చేయడంపై శుభ్‌మన్ దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు” అని పార్థివ్ పటేల్ స్పష్టం చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తొలిసారిగా కోహ్లీ, రోహిత్ భారత జెర్సీ ధరించనున్నాడు. బీసీసీఐ సెలక్షన్ కమిటీ, భారత క్రికెట్ జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. గతంలో రోహిత్ నాయకత్వంలో కోహ్లీ ఆడినప్పటికీ, ఇప్పుడు గిల్ కెప్టెన్సీలో ఈ ఇద్దరు దిగ్గజాలు ఆడటం అభిమానులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది.