ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు సమర్పించే చీరల ద్వారా ఆలయానికి వచ్చే ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన బహిరంగ వేలం ద్వారా ఆలయ ఖజానాకు భారీగా రాబడి సమకూరింది. గతంతో పోలిస్తే ఏడాదికి ఏకంగా రూ. 2.50 కోట్లకు పైగా అదనపు ఆదాయం రావడం గమనార్హం.
శుక్రవారం ఆలయ మహామండపంలో నిర్వహించిన చీరల సేకరణ టెండర్ల ప్రక్రియలో గుంటూరుకు చెందిన శ్రీ పావని కలెక్షన్స్ సంస్థ ఏడాదికి రూ. 8.15 కోట్లకు టెండర్‌ను దక్కించుకుంది. రాబోయే రెండేళ్లపాటు అమ్మవారికి భక్తులు సమర్పించే పట్టు, కాటన్, సాధారణ చీరలతో పాటు జాకెట్ ముక్కలను ఈ సంస్థ సేకరించనుంది. ఈ టెండర్ ప్రక్రియలో మొత్తం మూడు సంస్థలు పోటీపడగా, శ్రీ పావని కలెక్షన్స్ అత్యధిక మొత్తానికి పాడి దక్కించుకుంది.
గతంలో రెండేళ్ల కాలానికి ఓ ప్రైవేటు సంస్థకు ఏడాదికి కేవలం రూ. 5.50 కోట్ల చొప్పున మాత్రమే చీరల సేకరణ కాంట్రాక్టును అప్పగించారు. అయితే, తాజాగా నిర్వహించిన పారదర్శక వేలం పాటతో ఆలయ ఆదాయం ఒక్కసారిగా 35 శాతం పెరిగింది. ఈ వ్యూహాత్మక చర్యతో రాబోయే రెండేళ్లలో ఆలయానికి సుమారు రూ. 16.30 కోట్ల ఆదాయం సమకూరనుంది.
కమిషనర్ రామచంద్రమోహన్ సూచనల మేరకు పక్కా ప్రణాళికతో, పూర్తి పారదర్శకంగా ఈ టెండర్లను నిర్వహించామని ఆలయ ఈఓ శ్రీనానాయక్ తెలిపారు. గతంలో ఈ టెండర్ల విషయంలో లాబీయింగ్ జరిగాయన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈసారి ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా బహిరంగ వేలం నిర్వహించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది