గడువు ముగిసినా జరగకుండా నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు మార్గం సుగమం చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 9ను నిలిపివేసిన ధర్మాసనం, పాత విధానం ప్రకారమే ఎన్నికలతో ముందుకు వెళ్లవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టత నిచ్చింది. మొత్తం రిజర్వేషన్లు ఏ పరిస్థితుల్లోనూ 50 శాతం పరిమితిని దాటకూడదని తేల్చిచెప్పింది.
ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో 9తో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన జీఓలు 41, 42లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ జీఓల కారణంగా రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి చేరుకుంటాయని, ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితికి విరుద్ధమని పేర్కొంటూ వాటిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి ఉత్తర్వులు శుక్రవారం రాత్రి అందుబాటులోకి వచ్చాయి.