చిన్నారుల ఆరోగ్య భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన అనారోగ్యానికి, మరణాలకు కారణమవుతున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడు దగ్గు మందుల (సిరప్‌ల) అమ్మకాలపై తక్షణమే నిషేధం విధిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ అనే సిరప్‌లను విక్రయించరాదని స్పష్టం చేసింది. కోల్డ్ రిఫ్ దగ్గుమందు వాడకంపైనా కొన్ని రోజుల కిందటే నిషేధం విధించింది.
ఇతర రాష్ట్రాల్లో చోటుచేసుకున్న విషాదకర ఘటనలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కోల్డ్రిఫ్ అనే సిరప్ వాడటం వల్ల 16 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కాంచీపురం కేంద్రంగా పనిచేసే స్రెసన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసిన ఈ కోల్డ్రిఫ్ సిరప్‌పై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కూడా దృష్టి సారించారు.
ఈ నిషేధాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ఫార్మసీలు తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో, వైద్యుల పర్యవేక్షణ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా పిల్లలకు ఎలాంటి దగ్గు, జలుబు సిరప్‌లను ఇవ్వకూడదని తల్లిదండ్రులకు ప్రభుత్వం గట్టిగా సూచించింది. పిల్లల విషయంలో స్వంత వైద్యం ప్రమాదకరమని, ఏ చిన్న అనారోగ్యానికైనా తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలని అధికారులు హెచ్చరించారు