తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న జూబ్లీహిల్స్ శాసనసభ స్థానం ఉప ఎన్నికపై టీడీపీ తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ ఎన్నికల బరిలో నిలబడకూడదని, పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం రాత్రి తెలంగాణ టీడీపీ నేతలతో జరిపిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మంగళవారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. పొద్దుపోయేంత వరకు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రధానంగా చర్చించారు. పార్టీ శ్రేణులు ప్రస్తుతం ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా లేవన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. దీంతో పోటీ నుంచి తప్పుకోవడమే సరైనదని అధినేత నిర్ణయించారు.
అదే సమయంలో పొత్తు ధర్మానికి కట్టుబడి ఉండాలని చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలతో టీడీపీకి పొత్తు ఉన్నందున, తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ బీజేపీ నాయకత్వం అధికారికంగా మద్దతు కోరితే, వారితో కలిసి పనిచేయాలని, లేనిపక్షంలో తటస్థంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అయితే, కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ పార్టీలకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజల్లో టీడీపీ పట్ల ఇప్పటికీ అభిమానం ఉందని గుర్తుచేసిన చంద్రబాబు, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ పార్టీని తిరిగి బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని నేతలకు సూచించారు.