ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ అద్భుత విజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ అయిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. ట్రోఫీ మెడల్స్ తీసుకోకుండానే ఆటగాళ్లు డగౌట్‌కు చేరుకున్నారు. భారత్ ట్రోఫీని నిరాకరించినట్లు ప్రెసెంటేటర్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో గ్రౌండ్‌కు తీసుకొచ్చిన ట్రోఫీని వెనక్కి తీసుకెళ్లారు. టీమిండియా ప్లేయర్లు ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకున్నారు. ఈ అనూహ్య పరిణామంతో దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో గందరగోళం నెలకొంది. ఇక, ట్రోఫీ గెలిచిన భారత్‌కు రూ. 21కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.
భారత జట్టు నిర్ణయంతో బహుమతి ప్రదానోత్సవం ఆలస్యమైంది. అదే సమయంలో పాకిస్థాన్ ఆటగాళ్లు కూడా తమ డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఉండిపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న ఈ టోర్నీలో మొదటి నుంచి వాతావరణం వేడిగా ఉంది. అంతకుముందు, శనివారం జరగాల్సిన ట్రోఫీతో ఫోటో షూట్‌కు కూడా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నిరాకరించిన విషయం తెలిసిందే. టోర్నీలో జరిగిన లీగ్, సూపర్ ఫోర్ మ్యాచ్‌లలో ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం కూడా చేసుకోలేదు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి తొమ్మిదోసారి ఆసియా కప్ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఒక దశలో 13వ ఓవర్లో 113/1 స్కోరుతో పటిష్ఠంగా కనిపించింది. అయితే, భారత స్పిన్నర్లు చెలరేగడంతో కేవలం 33 పరుగుల వ్యవధిలో 9 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లతో సహా మొత్తం నాలుగు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో అద్భుతంగా ఆడిన తిలక్ వర్మ 51 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజూ శాంసన్, శివమ్ దూబేతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివరిలో రింకూ సింగ్ బౌండరీతో మరో బంతి మిగిలి ఉండగానే భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.