ప్రపంచాన్ని వణికిస్తున్న రేబిస్ మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) విడుదల చేసిన గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒకరు ప్రాణాలు కోల్పోతుండగా, ఆ మరణాల్లో మూడింట ఒక వంతు మన దేశంలోనే సంభవిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో కోట్లలో ఉన్న వీధికుక్కల సంఖ్యే ఈ విషాదానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది.
సెప్టెంబరు 28న ప్రపంచ రేబిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని డబ్ల్యూహెచ్‌వో కీలక సూచనలు చేసింది. కుక్కలకు సామూహికంగా వ్యాక్సిన్లు వేయడం, కుక్క కరిచిన వెంటనే బాధితులకు పోస్ట్-ఎక్స్‌పోజర్ ప్రోఫైలాక్సిస్ (పీఈపీ) చికిత్స అందించడం ద్వారా రేబిస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చని స్పష్టం చేసింది. అనేక దేశాల్లో 70 శాతం కుక్కలకు వ్యాక్సినేషన్ పూర్తి చేయడం ద్వారా రేబిస్‌ను నియంత్రించగలిగిన విషయాన్ని గుర్తు చేసింది.
భారత్‌లో పరిస్థితిపై ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్‌పీ) పార్లమెంటుకు సమర్పించిన వివరాలు భయానకంగా ఉన్నాయి. 2024 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదు కాగా, 54 అనుమానిత రేబిస్ మరణాలు సంభవించాయి. అదే సమయంలో, 2023లో 286 మంది రేబిస్ కారణంగా చనిపోయారని పశు సంవర్థక, డెయిరీ విభాగం (డీఏహెచ్‌డీ) నివేదించింది.
ఈ నేపథ్యంలో 2030 నాటికి దేశం నుంచి రేబిస్‌ను పూర్తిగా నిర్మూలించే లక్ష్యానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. జాతీయ రేబిస్ నియంత్రణ కార్యక్రమం (ఎన్‌ఆర్‌సీపీ) ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.