మూసీ ఉద్ధృతికి హైదరాబాద్ లోని చాదర్ ఘాట్ సమీపంలో పలు కాలనీలు నీట మునిగాయి. అంబేడ్కర్ బస్తీతో పాటు పలు కాలనీల్లోకి వరద చేరింది. ఎంజీబీఎస్ లోకి వెళ్లే మార్గంలో ఉన్న రెండు వంతెనలు నీట మునిగాయి. ఈ రెండు వంతెనలపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపేశారు. బస్టాండ్ లోకి వరద నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాల సాయంతో ప్రయాణికులు బస్టాండ్ లో నుంచి బయటపడ్డారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో మూసీ నది పొంగిపొర్లుతోంది.
చాదర్ ఘాట్ సమీపంలో నదికి ఇరువైపులా ఉన్న ఇళ్లు నీట మునిగాయి. మూసీ నీటిమట్టం అంతకంతకు పెరగడంతో పరీవాహక కాలనీల్లో జనాలు అర్ధరాత్రి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అధికారులు వందల మందిని సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత చాదర్‌ఘాట్ లోలెవల్ వంతెన పైనుంచి ఆరు అడుగుల మేర, మూసారాంబాగ్ వంతెనపై నుంచి 10 అడుగుల మేర వరద ప్రవహించింది. ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద పురోగతిలో ఉన్న పైవంతెన నిర్మాణ సామగ్రి వరద నీటిలో కొట్టుకుపోయింది.