హైదరాబాద్ నగరంలోని కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ సాధారణ ప్రసవంలో ఏకంగా 5 కిలోల బరువున్న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సాధారణంగా ఇంత బరువున్న శిశువులు సిజేరియన్ ద్వారా జన్మిస్తారని, కానీ సాధారణ కాన్పు కావడం విశేషమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు.
వివరాల్లోకి వెళితే.. మారేడ్‌పల్లిలోని ఆర్యా నగర్‌కు చెందిన నూరియన్ సిద్దిఖీ (23) అనే గర్భిణి, ప్రసవం కోసం కింగ్ కోఠి ఆసుపత్రిలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో చేరారు. ఆమె గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోతిర్మయి పర్యవేక్షణలో ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి 2:18 గంటల సమయంలో పురిటినొప్పులు అధికం కావడంతో వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం చేశారు. ఈ కాన్పులో 5 కిలోల బరువున్న బాబు పుట్టడంతో వైద్య సిబ్బంది సైతం ఆశ్చర్యపోయారు.
ఈ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంతోశ్ బాబు, ఆర్‌ఎంఓ డాక్టర్ సాధన మాట్లాడుతూ.. 39 వారాల గర్భిణి అయిన నూరియన్‌కు సుఖ ప్రసవం జరిగిందని తెలిపారు. తమ ఆసుపత్రి చరిత్రలో 5 కిలోల బరువుతో శిశువు జన్మించడం ఇదే మొదటిసారని డాక్టర్ సంతోశ్ బాబు పేర్కొన్నారు. వైద్యుల ప్రత్యేక శ్రద్ధ, నైపుణ్యం వల్లే ఇది సాధ్యమైందని వారు వివరించారు. తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు.