పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ థియేటర్లలో సందడి చేస్తోంది. నిన్న రాత్రి ప్రీమియర్ షోలతో ఈ సినిమా హంగామా ప్రారంభమైంది. ఈ సినిమా ఫీవర్ సాధారణ ప్రేక్షకులకే కాదు, సినీ ప్రముఖులకు కూడా పాకింది. ముఖ్యంగా మెగా కుటుంబ హీరోలు తమ మామయ్య సినిమాను చూసేందుకు అభిమానుల మధ్యకు వచ్చారు.
హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ‘ఓజీ’ సినిమాను వీక్షించారు. సాధారణ అభిమానుల మధ్య కూర్చుని సినిమా చూస్తూ వారు చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది. పవన్ కల్యాణ్ ఎంట్రీ సీన్లు, పవర్ఫుల్ డైలాగులు వచ్చినప్పుడు అభిమానులతో కలిసి కాగితాలు ఎగరేస్తూ కేరింతలు కొట్టారు. హీరోలమన్న హోదాను పక్కనపెట్టి, కేవలం పవన్ అభిమానులుగా మారిపోయి సినిమాను పూర్తిగా ఆస్వాదించారు. వీరితో పాటు ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ కూడా ఉండటం విశేషం.
ప్రస్తుతం ఈ మెగా హీరోలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తమ అభిమాన హీరోలతో కలిసి సినిమా చూసే అవకాశం దక్కడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మరోవైపు, దర్శకుడు సుజీత్ టేకింగ్, తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని, పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉందని ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణాన్ని సృష్టిస్తోంది.