వైసీపీ ‘డిజిటల్ బుక్’.. అధికారంలోకి వచ్చాక లెక్క తేలుస్తామన్న జగన్

V. Sai Krishna Reddy
2 Min Read

అధికార టీడీపీ కూటమిపై ప్రతిపక్ష వైసీపీ రాజకీయ దాడిని ముమ్మరం చేసింది. తమ పార్టీ కార్యకర్తలపై రాష్ట్రవ్యాప్తంగా పెడుతున్న అక్రమ కేసులు, వేధింపులను నమోదు చేసేందుకు ‘డిజిటల్ బుక్’ పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ డిజిటల్ బుక్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలిస్తామని, అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

గత ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేశ్ ప్రస్తావించిన ‘రెడ్ బుక్’కు ఇది సమాధానంగా కనిపిస్తోంది. “ఈ రోజు అది రెడ్ బుక్ కావచ్చు, రాబోయే రోజుల్లో అది డిజిటల్ బుక్ అవుతుంది” అని జగన్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకున్న అధికారుల పేర్లను రెడ్ బుక్‌లో రాశానని, కూటమి అధికారంలోకి వచ్చాక వారిపై చర్యలు తప్పవని లోకేశ్ హెచ్చరించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ‘రెడ్ బుక్ రాజ్యాంగాన్ని’ అమలు చేస్తోందని వైసీపీ నేతలు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు.

వేధింపులకు గురైన వారు తమ ఫిర్యాదులను digitalbook.weysrcp.com పోర్టల్‌లో గానీ, 040-49171718 ఐవీఆర్ఎస్ నంబర్‌కు ఫోన్ చేసి గానీ నమోదు చేయవచ్చని జగన్ తెలిపారు. ఎవరైనా అధికారి వేధిస్తే, అందుకు సంబంధించిన ఆధారాలను కూడా యాప్‌లో అప్‌లోడ్ చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన జగన్, 15 నెలల కూటమి పాలనలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, అవినీతి, బంధుప్రీతి పెరిగిపోయాయని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీలైన నిరుద్యోగ భృతి, స్త్రీ నిధి, 50 ఏళ్ల లోపు మహిళలకు పెన్షన్లు వంటివి అదృశ్యమయ్యాయని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణకు రూ.7,800 కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు కనీస మద్దతు ధర కూడా రైతులకు దక్కడం లేదని, యూరియా కొరతతో దళారులు లాభపడుతున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *