దీపావళి పండుగ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు వెలువరించింది. పండుగ సంతోషాన్ని పంచుకునేందుకు ప్రజల సొమ్ము వెచ్చించవద్దని ఆదేశించింది. ఇతర పండుగల సమయాల్లోనూ కానుకల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేయొద్దని మంత్రిత్వ శాఖలకు స్పష్టం చేసింది. ఆర్థిక క్రమశిక్షణకు, అనవసర వ్యయాలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొంది.
ప్రజావనరులను మరింత సమర్థవంతంగా వినియోగించేలా ప్రభుత్వ విభాగాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ నోటీసులు పంపింది. ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడం, అనవసర ఖర్చులను నియంత్రించడంపై ఆర్థిక శాఖ వ్యయ విభాగం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే దీపావళి సహా ఇతర పండగలకు బహుమతుల కోసం మంత్రిత్వ శాఖలు ఎలాంటి ఖర్చు చేయరాదని నోటీసుల్లో పేర్కొంది.