- కాంగ్రెస్ లో చేరలేదని సొసైటీ చైర్మన్ల తొలగింపు
- సొసైటీ డైరెక్టర్లు, చైర్మన్ లు రైతులే అనే విషయం మరిచిపోయారు.
- చల్లా ధర్మారెడ్డి, పరకాల మాజీ ఎమ్మెల్యే
హనుమకొండ / ప్రజాజ్యోతి::
కాంగ్రెస్ పార్టీలో చేరలేదని నెపంతో సొసైటీ చైర్మన్లను తొలగించడం దుర్మార్గపు చర్య అని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండ లోని వారి నివాసంలో నియోజకవర్గంలోని పలువురు ప్రాధమిక సహకార సంఘం చైర్మన్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆగస్ట్ నెల 14వ తేదీన ప్రాథమిక సహాకార సంఘాల పాలకవర్గ పదవి కాలం పొడిగించిన రోజు నుండే ఇతర పార్టీలకు చెందిన చైర్మన్లను కాంగ్రెస్ పార్టీలో చేరాలని అధికార పార్టీ నాయకులు, అధికారులు ఒత్తిడి తెచ్చినప్పటికీ పార్టీ మారని చైర్మన్లను పొంతనలేని సాకులతో తొలగించడం ఈ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. ఎన్నికల ప్రచారంలో 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతులు ఎవ్వరు చెల్లించద్దని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రుణాలు మాఫీ చేస్తామని ప్రగల్బాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి మాటలు నమ్మి రైతులు రుణాలు చెల్లించకుండా ఉన్నారు. ఇప్పుడు అదే సొసైటీ పాలకర్గంలో 2 లక్షలలోపు అప్పు ఉన్న సభ్యులను రుణాలు బాకీ ఉన్నారని తొలగించడం విడ్డురంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంత మంది రైతులకు రుణాలు మంజూరు చేశారో తెలపాలని అన్నారు. దమ్ముంటే ఇప్పుడున్న పాలకవర్గాలను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాలు విసిరారు. అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం అధికారులు పాలవర్గాలను బెదిరింపులకు పాల్పడడం సబబు కాదన్నారు. ఎన్నికల్లో గెలిచే సత్తాలేకనే పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. ఓటమి భయంతోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఎన్నికలు నిర్వహించే దమ్ములేదు. వ్యవసాయానికి సరిపడా యూరియా అందివ్వలేని చేతకాని ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తాకడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
