పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..
“రెనోవా బన్ను క్యాన్సర్“హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే నాయిని
హనుమకొండ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 10, (ప్రజా జ్యోతి):
రాష్ట్రంలో అతిపెద్ద రెండో నగరమైన వరంగల్, హనుమకొండ, కాజీపేట లో అత్యాధునిక సౌకర్యాలతో మెరుగైన వైద్య సదుపాయాలు ఏర్పాటు జరుగుతున్నాయని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. బుధవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ములుగు రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన “రెనోవా బన్ను క్యాన్సర్ “ దవాఖానను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , నగర మేయర్ గుండు సుధారాణి , డాక్టర్ గోదా విష్ణు వర్ధన్, రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఇ వి శ్రీనివాస్ రావు లు ముఖ్య అతిథులుగా హాజరై హాస్పిటల్ ప్రారంభించారు.నూతన మెడికల్ విధానంతో వస్తున్న రెనోవా బన్ను యాజమాన్యం పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలను అందించేందుకు ముందుకు రావాలని ఎమ్మెల్యే నాయిని పిలుపునిచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉందన్నారు. ప్రభుత్వ దవాఖానలతో పాటు ప్రైవేట్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలను మరింత విస్తృతం చేస్తామని ముఖ్యమంత్రి వైద్యరంగంలో నూతన ఒరవడి సృష్టించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపట్టిందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో వైద్యరంగంలో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ కొత్త దవాఖానాల ద్వారా స్థానికులుగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం, స్థానిక వైద్యులే ఈ హాస్పిటల్ సమూహంగా నడిపించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. డాక్టర్ నాయిని గోదా మాట్లాడుతూ మన ప్రాంత యువ వైద్యులను భాగస్వామ్యం చేస్తూ దవాఖాన ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. నేను వైద్య వృత్తిలో ఉన్న తరుణంలో మెరుగైన సాంకేతికతను తీసుకువరావడం గొప్ప పరిణామం అన్నారు. ప్రారంభ దశలోనే పేద ప్రజలకు వరప్రదాయినిగా నిలిచి ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులో ఉండటం పేద ప్రజలకు మేలు చేస్తుందని తెలిపారు. హనుమకొండ నగరంలో ఇప్పటికే ప్రభుత్వం ఘననీయమైన అభివృద్ధి చేస్తూన్నప్పటికీ కార్పొరేట్ ఆసుపత్రుల అభివృద్ధి చెందడం స్థానికంగా హైదరాబాదు తరహా వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. వరంగల్ నగరంలో క్యాన్సర్ వ్యాధికి నూతన వైద్య పరికరాలతో అందుబాటులో రావడం ద్వారా రోగులకు మరింత చేరువ అవుతుందని అన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ ,డైరెక్టర్ లు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.