దేశంలో ఈ ఏడాది రుతుపవనాల గమనం వింతగా ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతుంటే.. మరికొన్ని ప్రాంతాలు తీవ్ర వర్షాభావంతో అల్లాడుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితులకు వాతావరణ మార్పులు మాత్రమే కారణం కాదని, మన పట్టణ ప్రణాళికల్లోని లోపాలే కీలక పాత్ర పోషిస్తున్నాయని ఐఐటీ భువనేశ్వర్ నిపుణులు చెబుతున్నారు.
ఐఐటీ భువనేశ్వర్‌కు చెందిన స్కూల్ ఆఫ్ ఎర్త్, ఓషన్-క్లైమేట్ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ సందీప్ పట్నాయక్ ఈ అంశంపై కీలక విషయాలు వెల్లడించారు. దేశంలో సంభవిస్తున్న విపత్తులకు వాతావరణ మార్పు అనేది ఒక కోణం మాత్రమేనని అన్నారు. నగరాల్లో సరైన ప్రణాళిక లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థలు సక్రమంగా పనిచేయకపోవడం, మితిమీరిన కాంక్రీట్ వాడకం వంటివి తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయని వివరించారు. దీనివల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేక, నగరాలు తేలికగా ముంపునకు గురవుతున్నాయని ఆయన తెలిపారు.
ఈ ఏడాది రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా వర్షపాతంలో నాటకీయమైన మార్పులు కనిపించాయని పట్నాయక్ పేర్కొన్నారు. పాశ్చాత్య అవాంతరాల కారణంగా జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉత్తరాఖండ్, బీహార్ రాష్ట్రాల్లో అయితే భారీ వరదలకు గ్రామాలు కొట్టుకుపోయి వందల మంది గల్లంతయ్యారు. దీనికి పూర్తి విరుద్ధంగా, గంగా మైదాన ప్రాంతాలు జూన్‌లో వర్షం లేక ఎండిపోగా, మధ్య భారతదేశం మాత్రం భారీ వర్షాలతో తడిసిముద్దయింది.