వైఎస్ కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ ప్రవేశంపై గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాడని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు రాజారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెడతాడని ఆమె ప్రకటించారు. ఈ ప్రకటనతో ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.
ఈరోజు తన తల్లి షర్మిలతో కలిసి రాజారెడ్డి కర్నూలు పర్యటనకు వెళ్లారు. పర్యటనకు ముందు హైదరాబాద్‌లోని నివాసంలో అమ్మమ్మ విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కర్నూలు చేరుకుని, ఉల్లి మార్కెట్‌లో రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే విలేకరులతో మాట్లాడుతూ షర్మిల తన కుమారుడి రాజకీయ అరంగేట్రంపై అధికారిక ప్రకటన చేశారు.
ఇటీవల దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా పులివెందులలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద జరిగిన నివాళి కార్యక్రమంలో రాజారెడ్డి తన తల్లి షర్మిల పక్కనే కూర్చోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రవేశంపై జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా కర్నూలు పర్యటనలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొనడం, షర్మిల దీనిపై స్పష్టత ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు తెరపడినట్లయింది.
వైఎస్ రాజారెడ్డి అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. గతేడాది చట్నీస్ వ్యవస్థాపకుడు ప్రసాద్ అట్లూరి మనవరాలు ప్రియా అట్లూరిని ఆయన వివాహం చేసుకున్నారు.