భక్తులకు కీలక అప్‌డేట్.. 12 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత

V. Sai Krishna Reddy
1 Min Read

చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేయనున్నారు. దాదాపు 12 గంటల పాటు స్వామివారి దర్శనం భక్తులకు నిలిచిపోనుంది. గ్రహణం ముగిసిన తర్వాత సోమవారం వేకువజామున ఆలయ తలుపులు తిరిగి తెరుచుకోనున్నాయి.

ఆదివారం రాత్రి 9:50 గంటలకు ప్రారంభమయ్యే చంద్రగ్రహణం, సోమవారం తెల్లవారుజామున 1:31 గంటలకు ముగియనుంది. తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం, గ్రహణానికి సుమారు ఆరు గంటల ముందుగా, అంటే ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరిచిన అనంతరం, ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కైంకర్యాలు చేపడతారు. తోమాల, కొలువు, అర్చన వంటి సేవలను ఏకాంతంగా నిర్వహించిన తర్వాత, ఉదయం 6 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం క్యూలైన్లు శనివారం నాటికే బాటగంగమ్మ ఆలయం వరకు చేరాయి. ఆలయం మూసివేసేలోపు క్యూలో ఉన్న భక్తులందరికీ దర్శనం కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రహణం కారణంగా ఆదివారం జరగాల్సిన ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలతో పాటు పౌర్ణమి గరుడ సేవను కూడా టీటీడీ రద్దు చేసింది.

భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గ్రహణం కారణంగా అన్నప్రసాద కేంద్రాన్ని ఆదివారం సాయంత్రం 3 గంటలకు మూసివేసి, తిరిగి సోమవారం ఉదయం 8:30 గంటలకు ప్రారంభిస్తారు. ఈ సమయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా, తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 30 వేల అన్నప్రసాదం ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *