భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వివాహమై ముగ్గురు పిల్లలున్న ఓ వ్యక్తి, తన దూరపు బంధువైన బాలికతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తమ సంబంధాన్ని అంగీకరించడం లేదన్న మనస్తాపంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. భద్రాచలంలోని ఓ ప్రైవేటు లాడ్జిలో నిన్న ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం పెదరావిపాడుకు చెందిన నడిపింటి రవి (34) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఇప్పటికే వివాహమై భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన తన దూరపు బంధువైన 16 ఏళ్ల బాలికతో రవి ప్రేమలో పడ్డాడు. వీరి వ్యవహారంపై ఇరు కుటుంబాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
అయినా రవి తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో బాలిక తల్లిదండ్రులు ఈ ఏడాది ఫిబ్రవరి 5న అశ్వాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రవిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన రవి బాలికతో మళ్లీ సంబంధం కొనసాగించాడు. దీంతో ఇరు కుటుంబాల నుంచి ఒత్తిడి పెరిగింది.
ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన రవి, బాలికతో కలిసి రెండు రోజుల క్రితం భద్రాచలం వచ్చాడు. అక్కడి కరకట్ట సమీపంలోని ఓ ప్రైవేటు లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. నిన్న ఉదయం 8 గంటల సమయంలో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగారు. గది నుంచి శబ్దాలు రావడంతో అనుమానించిన లాడ్జి సిబ్బంది, తలుపులు తెరిచి చూడగా వారు అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే వారిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే, ఆసుపత్రికి చేరుకునేలోపే రవి మృతి చెందగా, బాలిక చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు