రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌లో దశాబ్దాలుగా కబ్జాలో మగ్గుతున్న అత్యంత విలువైన పార్కు స్థలానికి ఎట్టకేలకు విముక్తి లభించింది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు నిన్న ఆక్రమణలను తొలగించి భూమిని తమ అధీనంలోకి తీసుకున్నారు.
బండ్లగూడ జాగీర్‌లోని సర్వే నంబర్లు 96/2, 96/3, 52/12/E పరిధిలో ఉన్న లేఅవుట్‌లో మొత్తం 582 ప్లాట్లు ఉన్నాయి. ఈ లేఅవుట్‌లో ప్రజల సౌకర్యార్థం రెండు చోట్ల పార్కుల కోసం స్థలాలు కేటాయించారు. ఒకటి 1,200 చదరపు గజాలు కాగా, మరొకటి 3,200 చదరపు గజాల విస్తీర్ణంలో ఉంది. అయితే, కొందరు వ్యక్తులు ఈ 4,400 చదరపు గజాల పార్కు స్థలాన్ని కొన్నేళ్లుగా ఆక్రమించి, అభివృద్ధి పనులకు అడ్డుతగులుతున్నారు.
గతంలో మునిసిపల్ అధికారులు ఈ స్థలాల చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించినా కబ్జాదారులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఈ సమస్య పరిష్కారం కాకుండా ఏళ్ల తరబడి నానుతోంది. ఈ క్రమంలో ఇటీవల కొందరు స్థానికులు ‘ప్రజావాణి’ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన హైడ్రా.. రెవెన్యూ, మునిసిపల్ అధికారులతో కలిసి సంయుక్తంగా విచారణ చేపట్టింది. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అది పార్కు స్థలమేనని నిర్ధారించింది. గురువారం భారీ బందోబస్తు నడుమ అధికారులు ఆక్రమణలను పూర్తిగా తొలగించారు. అనంతరం, ఆ స్థలం చుట్టూ వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ‘ఈ పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది’ అని పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.