బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె ఉన్నత చదువుల అడ్మిషన్ కోసం ఆయన అండన్ వెళ్లారు. హరీశ్ నిన్న అక్కడి అంబేద్కర్ హౌస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దీనికి సంబంధించిన ఫొటోలను ఆయనే సోషల్ మీడియాలో పంచుకున్నారు. “బాబాసాహెబ్ తన విద్యార్థి రోజుల్లో ఒకప్పుడు నివసించిన లండన్‌లోని అంబేద్కర్ హౌస్‌ను సందర్శించాను. సమానత్వం, న్యాయం, సాధికారత ఇప్పటికీ ప్రతిధ్వనించే ఈ చారిత్రాత్మక ప్రదేశంలో ఆయనకు నా హృదయపూర్వక నివాళులు అర్పించాను. సమ్మిళిత భారతదేశం, న్యాయమైన ప్రపంచాన్ని నిర్మించడంలో ఆయన ఆదర్శాలు మనకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి” అని ఆయన ఈ సందర్భంగా ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, హరీశ్ రావుపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి హరీశ్ రావే బాధ్యుడని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, హరీశ్ రావు, సంతోష్ రావుల వల్లే తన తండ్రి కేసీఆర్ ఇబ్బందుల్లో పడ్డారని కూడా కవిత వ్యాఖ్యానించారు. సొంత పార్టీ నేత నుంచే ఈ స్థాయిలో ఆరోపణలు రావడం బీఆర్ఎస్‌లో కలకలం సృష్టించింది. కవిత చేసిన ఈ తీవ్ర వ్యాఖ్యలపై హరీశ్ రావు ఇప్పటివరకు స్పందించలేదు. రేపు ఆయన హైదరాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన ఈ అంశంపై మాట్లాడే అవకాశం ఉంది