తెలంగాణలో స్థానిక సమరానికి సర్వం సిద్ధం.. రెండో వారంలోనే నోటిఫికేషన్!

V. Sai Krishna Reddy
2 Min Read

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది. సెప్టెంబరు రెండో వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించి అనంతరం పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకు సంబంధించిన రెండు కీలక బిల్లులను అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత, సోమ లేదా మంగళవారం నాటికి జీవో జారీ చేయనుంది. ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తే, బీసీ స్థానాల కేటాయింపునకు తమకు వారం రోజుల సమయం అవసరమని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రభుత్వానికి తెలియజేసినట్లు తెలిసింది. సెప్టెంబరు 30 లోపు ఎన్నికల ప్రక్రియను ముగించాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు, ఎన్నికల సంఘం కూడా తన పనిని ముమ్మరం చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను సెప్టెంబరు 10 నాటికి ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం, సెప్టెంబరు 6న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించి, 8వ తేదీన రాజకీయ పార్టీలతో సమావేశమై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం అన్ని పరిశీలనల తర్వాత 10న తుది జాబితాను ప్రకటిస్తారు.

రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికల నిర్వహణ విషయంలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అడ్వొకేట్‌ జనరల్‌తో చర్చించిన తర్వాతే 2018 పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు చేసినట్లు మంత్రులు వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్లినా, తీర్పునకు లోబడే నడుచుకుంటామని వారు స్పష్టం చేశారు. ఏడాదిన్నరగా పాలక మండళ్లు లేకపోవడంతో నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులను తిరిగి పొందేందుకు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *