సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు కాబినెట్ గ్రీన్ సిగ్నల్
కరీంనగర్ బ్యూరో, ఆగస్టు 30, (ప్రజాజ్యోతి)
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ నెలలోనే నిర్వహించాలనే అంశానికి కాబినెట్ ఆమోదం తెలిపింది.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అధికారికంగా సమాచారం అందించనుంది. రాబోయే రోజుల్లో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి.కాబినెట్ నిర్ణయం ప్రకారం, ఎన్నికల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులను ఎంచుకోవాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఈ ఎన్నికల ద్వారా గ్రామీణ మరియు పట్టణ స్థాయిలో కొత్త ప్రజాప్రతినిధులు ఎన్నికై బాధ్యతలు స్వీకరించనున్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమని మంత్రి వర్గం అభిప్రాయపడింది. త్వరలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.