సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో మోసాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో ఓ వృద్ధుడిని పది రోజుల పాటు మానసికంగా వేధించి, ఏకంగా రూ.72 లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం బయటపడింది.
నారాయణగూడ సైబర్ క్రైమ్ పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం బంజారాహిల్స్‌కు చెందిన 82 ఏళ్ల వృద్ధుడికి ఆగస్టు 11న వాట్సాప్‌లో ఓ వీడియో కాల్ వచ్చింది. కాల్‌లో మాట్లాడిన వ్యక్తి పోలీస్ యూనిఫాంలో ఉండి, తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఓ మనీలాండరింగ్ కేసులో బాధితుడి ప్రమేయం ఉందని, అతని ఆధార్ కార్డుతో బ్యాంకు ఖాతా తెరిచి నేరానికి పాల్పడినట్లు ఆరోపించాడు.
ఈ కేసులో బాధితుడిని నిందితుడిగా చేర్చామని నమ్మబలికిన మోసగాళ్లు, అతడిని ‘డిజిటల్ అరెస్ట్’ చేస్తున్నట్లు ప్రకటించారు. పది రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడకూడదని, ఇంటి నుంచి బయటకు రాకూడదని తీవ్రంగా హెచ్చరించారు. మరుసటి రోజు ఉదయం, మరో వీడియో లింక్ ద్వారా సుప్రీంకోర్టు ముందు తప్పుడు వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేశారు. నిరంతరం బెదిరింపులకు పాల్పడుతూ, ‘విచారణ’ పూర్తయ్యే వరకు డబ్బు అవసరమని నమ్మించారు.
వారి మాటలు నిజమని నమ్మిన ఆ వృద్ధుడు వారు చెప్పిన వేర్వేరు బ్యాంకు ఖాతాలకు విడతల వారీగా రూ.72 లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత కూడా నేరగాళ్లు మరింత డబ్బు కోసం డిమాండ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించి, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు