వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిందో భార్య. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు, తన భర్త నిద్రలోనే ప్రాణాలు విడిచాడని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సరూర్ నగర్‌లోని కోదండరాం నగర్ రోడ్డు నెం.7లో జెల్లెల శేఖర్ (40), అతని భార్య చిట్టి (33) నివాసం ఉంటున్నారు. శేఖర్ డ్రైవర్ కాగా, చిట్టి ఇళ్లల్లో పని చేస్తోంది. కొంతకాలంగా చిట్టికి హరీశ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని చిట్టి తన ప్రియుడు హరీష్‌తో కలిసి ప్రణాళిక వేసింది.
పథకం ప్రకారం, అర్ధరాత్రి భర్త శేఖర్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు చిట్టి తన ప్రియుడు హరీశ్‌ను ఇంటికి పిలిపించింది. అనంతరం ఇద్దరూ కలిసి శేఖర్‌ను హత్య చేశారు. ఉదయం నిద్రలేచిన తర్వాత, తన భర్త నిద్రలోనే మరణించాడంటూ డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు శేఖర్ మృతిపై అనుమానం కలిగింది. దీంతో వారు తమదైన శైలిలో చిట్టిని విచారించగా, ఆమె అసలు నిజాన్ని బయటపెట్టింది. తన ప్రియుడు హరీశ్‌తో కలిసి తానే భర్తను హత్య చేసినట్లు నేరం అంగీకరించింది. దీంతో పోలీసులు చిట్టిని అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న ఆమె ప్రియుడు హరీశ్ కోసం గాలిస్తున్నారు.