ప్రాణాలు కోల్పోతున్నా విధి నిర్వహణను విస్మరించని డ్రైవర్. గుండెపోటుతో కుప్పకూలుతున్నప్పటికీ, చివరి క్షణాల్లో బస్సు స్టీరింగ్‌ను పక్క డ్రైవర్‌కు అందించి పెను ప్రమాదాన్ని నివారించాడు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడి తనువు చాలించిన ఈ విషాద ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.
సతీశ్ రావు అనే డ్రైవర్ జోధ్‌పూర్ – ఇండోర్ వెళ్తున్న బస్సును నడుపుతున్నాడు. గురువారం ఉదయం కేల్వా రాజ్ నగర్ సమీపంలోకి రాగానే ఆయనకు అస్వస్థతగా అనిపించింది. పరిస్థితి చేయిదాటిపోతోందని గ్రహించిన సతీశ్, వెంటనే అప్రమత్తమై స్టీరింగ్‌ను తన సహోద్యోగికి అప్పగించి, ఆ వెంటనే కుప్పకూలిపోయాడు. సుదూర ప్రయాణాల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండాలన్న నిబంధన ఈ సందర్భంలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది.
సతీశ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక మహిళ కేకలు వేయగా, కొందరు సతీశ్‌ను పట్టుకుని నిలబెట్టే ప్రయత్నం చేయగా, మరికొందరు ఆయన కాళ్లు రుద్దుతూ సాయపడ్డారు. ఈ దృశ్యాలు బస్సులోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. బస్సును తన ఆధీనంలోకి తీసుకున్న రెండో డ్రైవర్, గోమతి చౌరస్తాలో మందుల కోసం ప్రయత్నించినప్పటికీ, మెడికల్ షాపులు మూసి ఉండటంతో విఫలమయ్యాడు.
అక్కడి నుంచి బయలుదేరాక, దేశూరి నాల్ ఘాట్ సమీపంలో సతీశ్ పరిస్థితి మరింత విషమించింది. పరిస్థితి తీవ్రతను గమనించిన సహోద్యోగి, బస్సును నేరుగా దేశూరిలోని ఆసుపత్రికి తరలించాడు. అయితే, అప్పటికే సతీశ్ రావు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సతీశ్ సమయస్ఫూర్తితో వ్యవహరించకపోయి ఉంటే బస్సు అదుపుతప్పి ఘోర ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు, ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.