తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరద నీటిలో చిక్కుకున్న ఐదుగురిని సైనిక హెలికాప్టర్లు గురువారం రక్షించాయి. గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద బుధవారం నుంచి వరద ఉధృతిలో చిక్కుకున్న వీరిని రక్షించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పశువులను మేపేందుకు వెళ్లిన ఈ ఐదుగురు గ్రామస్థులు, అకస్మాత్తుగా పెరిగిన వరద ప్రవాహానికి చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వెంటనే స్పందించారు. ఆయన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడి, బాధితులను కాపాడేందుకు తక్షణమే హెలికాప్టర్లను పంపాలని విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ అభ్యర్థనపై రాజ్‌నాథ్ సింగ్ వెంటనే స్పందించి, సహాయక చర్యల కోసం రెండు హెలికాప్టర్లను పంపాలని రక్షణ శాఖ అధికారులను ఆదేశించారు.
హెలికాప్టర్లు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ముందు, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి. గీతే ఆధ్వర్యంలో అధికారులు డ్రోన్ల సహాయంతో బాధితులకు ఆహార పొట్లాలు, నిత్యావసరాలను అందించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బుధవారం బాధితులతో ఫోన్‌లో మాట్లాడి, వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తామని ధైర్యం చెప్పారు.
సహాయక చర్యల సమన్వయంపై ఐఏఎఫ్ ఎయిర్ కమోడోర్ వి.ఎస్. సైనీ, గ్రూప్ కెప్టెన్ చటోపాధ్యాయలతో బండి సంజయ్ సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా హెలికాప్టర్ల రాక ఆలస్యమైందని, నాందేడ్, బీదర్ వంటి ప్రత్యామ్నాయ కేంద్రాల నుంచి వాటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని వారు వివరించారు. సహాయక చర్యలు పూర్తయినప్పటికీ, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆ రెండు హెలికాప్టర్లు సిరిసిల్లలోనే ఉంటాయని మంత్రి తెలిపారు. తక్షణమే స్పందించి సహాయం అందించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.