హైదరాబాద్‌లోని ప్రముఖ మహీంద్రా యూనివర్సిటీలో మాదకద్రవ్యాల వాడకం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఐదుగురు విద్యార్థులకు డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఓ రెస్టారెంట్ యజమాని ఇచ్చిన కచ్చితమైన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వర్సిటీలో సోదాలు జరిపి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 50 మంది విద్యార్థులను దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు మహీంద్రా యూనివర్సిటీలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో కిలోన్నర గంజాయితో పాటు 47 గ్రాముల ఓజీ వీడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీమారుతి కొరియర్ సర్వీస్ ద్వారా ఢిల్లీ నుంచి ఈ డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గతంలో విద్యార్థులు నిక్ అనే నైజీరియన్ నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసి నగరంలోని పలు పబ్‌లలో పార్టీలు చేసుకున్నట్లు కూడా గుర్తించారు. డ్రగ్స్ బారిన పడిన విద్యార్థులకు పోలీసులు ప్రస్తుతం కౌన్సెలింగ్ ఇస్తున్నారు.