కొండకల్ గ్రామంలో లహరి “అమేయ” లేఅవుట్ వివాదం – చెరువుకు అనుకుని ఉన్న భూమి, ఇరిగేషన్ అనుమతి లేకపోయినా అధికారులు మౌనం!
శంకర్పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో లహరి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చేపట్టిన “లహరి అమేయ” లేఅవుట్ ప్రాజెక్టుపై సందేహాలు ముదురుతున్నాయి.
సర్వే నంబరు 474/1లో అభివృద్ధి జరుగుతున్న ఈ ప్రాజెక్టుకు HMDA ఆమోదం, RERAనమోదు ఉన్నప్పటికీ, చెరువు పరిసర నియమాలు, ఇరిగేషన్ శాఖ
అనుమతి లేమి వంటి అంశాలు బయటపడినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.
ప్రాజెక్టు భూమి స్థానిక చెరువుకు అనుకుని ఉంది. మొత్తం భూమిలో దాదాపు 20% చెరువు పరిరక్షణ మండలిలోకి వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ ప్రాంతంలో కొత్త నిర్మాణాలు జరగకూడదని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి.
నిబంధనల ప్రకారం చెరువులు, సాగు కాలువలకు ఆనుకుని ఉన్న భూములపై లేఅవుట్ అభివృద్ధి చేయాలంటే ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి (NOC) తప్పనిసరి.
అయితే ఈ ప్రాజెక్టు ఇంకా ఆ అనుమతి పొందలేదు.
ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండానే HMDA లేఅవుట్ ఆమోదం ఇవ్వడం చర్చనీయాంశమైంది. పత్రాలు సరిగా పరిశీలించకుండానే ఆమోదం ఇచ్చారా?
లేక ఒత్తిడి వల్ల క్లియర్ అయిందా? అన్న ప్రశ్నలు లేవుతున్నాయి.
స్థానికులు పలుమార్లు సమస్యను ప్రస్తావించినప్పటికీ ఇరిగేషన్ శాఖ, HMDA అధికారులు ఇప్పటివరకు స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ మౌనం ప్రాజెక్టుపై మరింత అనుమానాలను రేకెత్తిస్తోంది.
“అనుమతులు సరిగా లేని ప్రాజెక్టులపై కఠిన చర్యలు తప్పవు” అని ఇటీవల HYDRAA ప్రకటించింది. చెరువులు, జలాశయాల పరిరక్షణ HYDRAA బాధ్యతల్లో భాగమే కావడంతో,
లహరి అమేయ ప్రాజెక్టు కూడా పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.