భర్తతో గొడవ కారణంగా పుట్టింటికి చేరుకుందో మహిళ.. భార్యను తీసుకెళ్లడానికి వచ్చిన అల్లుడిని మామ నిలదీశాడు. తన కూతురును పంపించేది లేదని తేల్చిచెప్పాడు. దీంతో మాటామాటా పెరిగడంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన అల్లుడు.. పెట్రోల్ తీసుకొచ్చి మామపై పోసి నిప్పంటించాడు. ఈస్ట్ ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో తండ్రి మృత్యువాత పడ్డాడు. పోలీసులు, బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం..
ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే నిష, సందీప్ దంపతులు ఇటీవల గొడవపడ్డారు. భర్తపై కోపంతో ఆగస్టు 15న నిష ఘరోలీ ఎక్స్ టెన్షన్ లోని తన పుట్టింటికి చేరుకుంది. భర్త వేధిస్తున్నాడంటూ తండ్రి రణ్ వీర్ సింగ్ తో చెప్పుకుంది. మరుసటి రోజు నిషను తీసుకెళ్లడానికి వచ్చిన సందీప్ ను ఇదే విషయంపై రణ్ వీర్ సింగ్ నిలదీశాడు. తన కూతురును ఎందుకు కష్టపెడుతున్నావని ప్రశ్నించాడు. ఈ విషయంపై మామా అల్లుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. తన కూతురును పంపించబోనని రణ్ వీర్ సింగ్ అల్లుడికి తెగేసి చెప్పాడు.
ఆగ్రహంతో రగిలిపోయిన సందీప్.. పెట్రోల్ తీసుకొచ్చి మామపై పోసి నిప్పంటించాడు. చుట్టుపక్కల వారు మంటలు ఆర్పి, తీవ్ర గాయాలపాలైన రణ్ వీర్ సింగ్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ రణ్ వీర్ సింగ్ మరణించాడు. చనిపోవడానికి ముందు సందీప్ తన కూతురును పెళ్లి చేసుకున్న నాటి నుంచే తమ కుటుంబాన్ని వేధిస్తున్నాడంటూ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సందీప్ ను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.