చౌటుప్పల్ మండలంలోని జైకేసారం శివారులో ఉన్న ఎస్‌ఆర్ రసాయన కర్మాగారంలో నిన్న రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో ప్రమాదం జరిగిందని పరిశ్రమ అధికారులు, పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ప్రమాదం సంభవించిన సమయంలో సుమారు 10 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు. ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. క్షణాల్లోనే మంటలు ప్రొడక్షన్ బ్లాక్ మొత్తాన్ని అంటుకుని భారీగా ఎగసిపడ్డాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పరిశ్రమలో ఉన్న రసాయన ద్రవాలు బయటపడటంతో రియాక్టర్లు పేలిపోయినట్లు అనుమానిస్తున్నారు.
రాత్రి సమయం కావడంతో ప్రమాద తీవ్రత పూర్తిగా అర్థం కావడంలో జాప్యం ఏర్పడింది. ప్రమాదం కారణంగా పరిశ్రమ పరిసరాల్లో దుర్వాసన వ్యాపించడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ఈ ఘటనపై చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ స్పందిస్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. ప్రమాదం జరగడానికి గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. ప్రొడక్షన్ బ్లాక్ పూర్తిగా కాలిపోవడంతో భారీ ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.