- గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని
* ఆర్డీఓ పార్థసింహారెడ్డి
ఎల్లారెడ్డి ఆగస్టు -22 (ప్రజా జ్యోతి)
గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎల్లారెడ్డి ఆర్డిఓ పార్థసింహారెడ్డి సూచించారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయంలో గణేష్ చతుర్థి ఉత్సవాలపై మున్సిపల్ కమిషనర్లు, పోలీసు అధికారులు, గణేష్ ఉత్సవ సమితి, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులతో, మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల వినాయక చవితి ఉత్సవాలు భక్తులు, నిర్వాహకులు భక్తిశ్రద్దలతో సురక్షిత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలపారు. గణేష్ శోభాయాత్ర నిర్వహించే దారిలో గుంతలు పడినరహదారులు, ప్యాచ్ వర్క్ పనులు, గణేష్ నిమజ్జనం నిర్వహించే ప్రదేశాల వద్ద క్రేన్లు, బారికేడింగ్, వేదిక ఏర్పాట్లు మున్సిపల్, ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు కలసి చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతరం సరఫరా కొనసాగించాలని, సమస్యలు ఎక్కువగా ఉన్నచోట బందోబస్తూ కల్పించాలని, సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలన్నారు. నంబరింగ్ ఇచ్చిన మండపాల వద్ద పరిశుభ్రత పాటించాలని, వాటి వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని, ఫాగింగ్, శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారం ఆదేశించారు. విగ్రహాలు ఊరేగింపు సమయంలో వాహనాల్లో ఎటువంటి యాంత్రిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, నిమజ్జన శోభాయాత్ర మార్గాల్లో వేలాడే తీగలు, వంగి ఉన్న చెట్లు, తదితర వాటిని తొలిగించాలని తెలిపారు. చెరువుల వద్ద ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ రావు, సీఐ రాజారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేష్, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, డీఎల్పిఓ సురేందర్, ఎస్సై మహేష్, ఫైర్ అధికారి వినోద్, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
