కర్ణాటకను కుదిపేస్తున్న ధర్మస్థల సామూహిక ఖననాల కేసు రోజుకో మలుపు తిరుగుతూ మరింత సంక్లిష్టంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక వ్యక్తి మాట మార్చగా, తాజాగా మరో మహిళ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. ధర్మస్థలలో తన కుమార్తె అదృశ్యమైందంటూ తాను చెప్పినదంతా అబద్ధమేనని, అసలు తనకు ఆ పేరుతో కూతురే లేదని ఆమె స్పష్టం చేయడం గమనార్హం.
సుజాతా భట్ అనే మహిళ ఇటీవల దక్షిణ కన్నడ పోలీసులను ఆశ్రయించారు. 2003లో తన కుమార్తె అనన్య భట్ స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వచ్చి కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు చేపట్టిన తరుణంలోనే, నిన్న ఆమె ఓ యూట్యూబ్ చానల్‌తో మాట్లాడుతూ తాను చెప్పిందంతా కట్టుకథేనని వెల్లడించారు. “అనన్య భట్ పేరుతో నాకు కుమార్తె లేదు. ఆ ఫొటోలు కూడా సృష్టించినవే. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రముఖులు నాతో ఈ అబద్ధం చెప్పించారు” అని ఆమె పేర్కొన్నారు.
ఈ కట్టుకథ చెప్పడానికి గల కారణాన్ని కూడా సుజాత వివరించారు. “ఈ పని చేసినందుకు నేను ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. మా తాతగారి భూమిని ధర్మస్థల ఆలయ అధికారులు మా అనుమతి లేకుండా తీసుకున్నారు. ఆ ఆస్తి వివాదాన్ని తేల్చుకునేందుకే వారు చెప్పినట్టు నడుచుకున్నా” అని ఆమె తెలిపారు. అయితే, తాను ఎంత పెద్ద తప్పు చేశానో తర్వాత అర్థమైందని, అందుకే ఇప్పుడు నిజం చెబుతున్నానని సుజాత భట్ అన్నారు. కర్ణాటక ప్రజలు, ధర్మస్థల భక్తులు తనను క్షమించాలని ఆమె వేడుకున్నారు.
ధర్మస్థలలో వందల మృతదేహాలను పూడ్చిపెట్టానని గతంలో భీమా అనే పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించడం తెలిసిందే. అతడి సమాచారంతో తవ్వకాలు కూడా జరిగాయి. అయితే, ఇటీవల అతను కూడా మాట మార్చాడు. తనకు ఒకరు పుర్రె ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వమన్నారని, న్యాయస్థానంలో పిటిషన్ కూడా వారే వేయించారని చెప్పడంతో ఈ కేసు దర్యాప్తు అధికారులకు సవాలుగా మారింది. ఇప్పుడు సుజాతా భట్ యూటర్న్‌తో ఈ వ్యవహారం మరింత ఉత్కంఠ రేపుతోంది.