పరదా’ – మూవీ రివ్యూ!

V. Sai Krishna Reddy
4 Min Read

విలేజ్ నేపథ్యంలో నడిచే కథ
నటన పరంగా మెప్పించిన అనుపమ
కాలాన్ని .. ప్రాంతాన్ని పట్టించుకోని కంటెంట్
నిదానంగా సాగే కథాకథనాలు
ఆడియన్స్ ముందుగానే ఊహించే క్లైమాక్స్

అనుపమా పరమేశ్వరన్ మంచి ఆర్టిస్ట్. అందులో ఎలాంటి సందేహం లేదు. అటు సంప్రదాయ బద్ధమైన పాత్రలలోను .. ఇటు మోడ్రన్ డ్రెస్ లలోను ప్రేక్షకుల మనసు గెలుచుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అలాంటి అనుపమ తనకి అలవాటైన నాయికా ప్రధానమైన కంటెంట్ తో చేసిన మరో సినిమానే ‘పరదా’. విలేజ్ నేపథ్యంలో నడిచే కథ ఇది. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్స్ కి వచ్చింది.

కథ: అది ‘పడతి’ అనే ఒక విలేజ్. అక్కడ సుబ్బులక్ష్మి (అనుపమా పరమేశ్వరన్) కూడా తన తండ్రితో కలిసి నివసిస్తూ ఉంటుంది. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన దురదృష్టవంతురాలు ఆమె. ఆ ఊళ్లోని వాళ్లందరికీ ఇలవేల్పు ‘జ్వాలమ్మ తల్లి’. ఆ గ్రామంలో ఈడొచ్చిన అమ్మాయిలంతా, ముఖం కనిపించకుండా ‘పరదా’ ధరించాలి. ఒకవేళ పరదా లేకుండా ఎవరికైనా కనిపిస్తే, అది అమ్మవారికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. గర్భవతులుగా ఉన్న స్త్రీలకు .. కడుపులో ఉన్న బిడ్డకు ప్రాణహాని అనే నమ్మకం అక్కడివారిలో బలంగా ఉంటుంది.

ఇక ఎవరైతే పరదా నియమాన్ని ఉల్లంఘించారో, వాళ్లు తమంతట తాముగా గ్రామస్తుల సమక్షంలో బావిలోకి దూకి ఆత్మర్పణ చేయవలసి ఉంటుంది. అలా చేసినవారి సమాధులు కూడా ఆ గ్రామంలో చాలానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో సుబ్బు అదే గ్రామానికి చెందిన రాజేశ్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. అతనినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. పెద్దలు కూడా అందుకు అంగీకరిస్తారు. నిశ్చితార్థానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇంత జరుగుతున్నా అతని దగ్గర కూడా ఆమె పరదా తీయదు.

నిశ్చితార్థం రోజు రానే వస్తుంది. సుబ్బు స్నేహితురాలైన రత్న ( సంగీత) కూడా సిటీ నుంచి ఆ ఫంక్షన్ కి వస్తుంది. ఆ సమయంలోనే ఒక ఇంగ్లిష్ మేగజైన్ కవర్ పేజీపై సుబ్బు ఫొటో వస్తుంది. అది చూసి ఊళ్లోవాళ్లంతా ఆశ్చర్యపోతారు. ఆ క్షణంలోనే నిశ్చితార్థాన్ని రద్దు చేస్తారు. ఆ ఫోటొ ఎవరు తీశారో తనకి తెలియదనీ, అందులో తన ప్రమేయం లేదని సుబ్బు చెబుతుంది. ఆ విషయాన్ని నిరూపించుకోమనీ, లేదంటే ఆత్మార్పణకి సిద్ధం కావాలని పెద్దమనుషులు తీర్పు చెబుతారు. తాను తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసం సుబ్బు ఏం చేస్తుంది? ఆ ప్రయత్నంలో ఆమెకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనేది కథ.

విశ్లేషణ: ఒక గ్రామంలో అమ్మవారితో ముడిపడిన ఒక ఆచారం. ఆ ఆచారాన్ని అన్నివేళలా పాటిస్తూ వస్తున్న యువతికే ఆ ఊరు ఒక పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో తాను గెలవకపోతే అందుకు ప్రతిగా తన ప్రాణాలనే చెల్లించే పరిస్థితి. అప్పుడు ఆ యువతి ఏం చేస్తుంది? అనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను తయారు చేసుకున్నాడు. అయితే తాను అనుకున్న కథను తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో మాత్రం బాగానే తడబడ్డాడు.

ఈ కథకు మూలమైన ‘జ్వాలమ్మ’ జాతరతో ఈ సినిమా మొదలవుతుంది. విలేజ్ వాతావరణం .. అనుపమ లుక్ .. గతంలో ఇలా జరిగిందంటూ వచ్చే వాయిస్ ఓవర్ .. ఇవన్నీ చూస్తూ పేక్షకుడు కాస్త కంగారు పడతాడు. ఇంత కఠినమైన నియమాలా? ఆచారం పేరుతో ఇంతటి అనాచారం నాకు తెలిసి ఎక్కడా జరగలేదు అనుకుంటూ భయపడతాడు. ఇంతకీ ఈ కథ ఉత్తరాదిలో ఎక్కడ జరుగుతుంది? ఏ కాలంలో జరుగుతుంది? అనుకుంటాడు. ఇది తెలుగు ప్రాంతంలో జరిగే కథ .. ప్రస్తుతం జరిగే కథ అని తెలిసినప్పుడు నివ్వెరపోకుండా ఉండటం కష్టమే.

విలేజ్ సందుల్లో నడిచే ఈ కథ కోసం దర్శకుడు కాలంలో చాలా వెనక్కి వెళ్లి ఉంటాడని అనుకున్న ఆడియన్స్, సుబ్బలక్ష్మి స్మార్ట్ ఫోన్ బయటికి తీయగానే ఉలిక్కి పడతారు. ఆంగ్ల పత్రికలు సైతం దొరికే ఊరు అని చెప్పేసరికి, కోలుకోలేని దెబ్బతిన్నట్టుగా కుప్పకూలిపోతారు. కథకి .. కాలానికి అస్సలు సెట్ కావడం లేదే అనే అయోమయంలోనే ఎక్కువ సేపు గడిపేస్తారు.

తాను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడం కోసం సుబ్బు బయల్దేరే వరకూ కథ కాస్త ఫరవాలేదు. ఆ తరువాత కథ మరింత ఊపందుకుంటుందని ఆశపడిన ప్రేక్షకులు మరింత డీలా పడతారు. అనాచారాలకు జీవితాన్ని బలిచేసుకోవద్దు .. ఎవరికి నచ్చినట్టుగా వారు బ్రతకడంలోనే అసలైన ఆనందం ఉంది అంటూ ఇచ్చిన సందేశం బాగానే ఉంది. కానీ ఆ సందేశాన్ని వినోదంతో కలిపి అందించడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది.

పనితీరు: దర్శకుడు ఎంచుకున్న లైన్ బాగానే ఉందనిపించవచ్చు. అయితే ఈ కథ జరుగుతున్నట్టుగా చూపించిన ప్రాంతం .. కాలం .. పొంతనలేని సన్నివేశాలు ప్రేక్షకులను నిరాశ పరుస్తాయి. ‘పడతి’ అనే ఊరు పేరు అస్సలు మింగుడు పడదు .. జీర్ణం కాదు. అమ్మవారితో పరదా పద్ధతి వచ్చిందని చెప్పి, అమ్మవారి ముఖం కూడా కనిపించకుండా విగ్రహానికి పరదాలు చుట్టడం కొసమెరుపు.

అనుపమ విషయానికి వస్తే ఆమె నటనకు వంక బెట్టవలసిన అవసరం లేదు. కాకపోతే ఈ సినిమాలో మేకప్ సెట్ కాక, కాళ్లు – చేతులు తెల్లగా .. ముఖం నల్లగా కనిపించాయంతే. సంగీత .. దర్శన రాజేంద్రన్ నటన కూడా ఆకట్టుకుంటుంది. మృదుల్ సుజిత్ సేన్ ఫొటోగ్రఫీ బాగుంది. గోపీసుందర్ సంగీతం ఫరవాలేదు. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ ఓకే.

ముగింపు: ఫలానా కాలంలో .. ఫలానా ప్రాంతంలో ఇలాంటి ఒక అనాచారం ఉండేది అంటే ఆ లెక్క వేరుగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో జరుగుతున్నట్టుగా ఇలాంటి ఒక అనాచారాన్ని ఆవిష్కరిస్తే, అది కల్పితమైనా కనెక్ట్ కాదు. ప్రేక్షకులు ఊహించినట్టుగానే నడుస్తూ, వాళ్లు అనుకున్న గమ్యానికి చేరే కథల్లో ఇది కూడా చేరిపోతుంది అంతే.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *