మేరు శిఖరం .. మన మెగాస్టార్

V. Sai Krishna Reddy
2 Min Read

కలలు కనండి .. వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడండి’ అని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే ఆ మాటలను ఆచరిస్తారు .. ఆ మార్గాన్ని అనుసరిస్తారు. ఎంత కష్టపడినా అదృష్టం ఉండొద్దూ అంటూ తేల్చేస్తారు కొంతమంది. కష్టపడేవారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని నమ్ముతారు మరికొంతమంది. ఎదగాలని ఆశపడితే సరిపోదు .. ఎదిగే దిశగా కష్టపడాలనే సత్యానికి కొందరి జీవితాలు నిలువెత్తు నిర్వచనాలుగా నిలుస్తాయి. అలాంటివారిలో చిరంజీవి ఒకరుగా కనిపిస్తారు.

నటుడిగా 47 ఏళ్ల ప్రయాణం .. 150కి పైగా సినిమాలు .. ఎన్నో విజయాలు .. మరెన్నో మైలురాళ్లు. ఎంతోమంది దర్శక నిర్మాతలు .. రచయితలు .. సంగీత దర్శకులు .. నాయికలు ఆయనతో కలిసి పనిచేశారు. కానీ ఎవరితో ఎప్పుడూ ఎలాంటి వివాదం లేదు. ఆయనతో కలిసి పనిచేయడమే అదృష్టంగా భావిస్తూ వచ్చారు. ఆయనను విమర్శించినవారు లేకపోలేదు. కానీ ఆదర్శవంతమైన తన అడుగుజాడలతోనే ఆయన సమాధానమిచ్చారు.

తెలుగు సినిమా ఒక మూసలో వెళుతూ ఉండగా, ఒక ప్రభంజనంలా .. మలయమారుతంలా చిరంజీవి దూసుకొచ్చారు. తెలుగు సినిమా కథలను .. పాటలను .. డాన్సులను .. పోరాటాలను కొత్త దారుల్లో పరిగెత్తించారు. ఎప్పటికప్పుడు తనని తాను సవరించుకుంటూ .. సరిచేసుకుంటూ కొత్త ట్రెండ్ ను అందుకుంటూ పరిగెత్తారు. తనని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి అనేకమంది రావడానికి స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పుడంటే సోషల్ మీడియా కారణంగా చిరంజీవి అందరికీ అందుబాటులో ఉన్నారు. కానీ ఒకప్పుడు ఆయనను ఒకసారి చూస్తే చాలు అనుకునేవారు.

చిరంజీవి కెరియర్లోను ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ప్రతి మలుపును గెలుపుగా మార్చుకోవడానికి ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. అందువల్లనే ఆయన ప్రతి విజయాన్ని వినయంతో స్వీకరించారు. అవాంతరాలను అణకువతోనే అధిగమించారు. ఒక వ్యక్తి అడపాదడపా గెలవడం విజయం కాదు. ఒక వ్యక్తి వ్యవస్థగా మారడమే అసలైన విజయం. అలాంటి విజయాన్నిసొంతం చేసుకున్నవారాయన. తెరపై హీరోయిజాన్ని ప్రదర్శించడమే కాదు, తెరవెనుక మానవత్వాన్ని చాటుకున్న మహర్షి ఆయన.

ఒక వ్యక్తి ఇండస్ట్రీలో హీరోగా మారడం సహజమే. కానీ ఒక హీరోనే ఇండస్ట్రీగా ఎదగడం చిరంజీవి విషయంలోనే జరిగింది. చిరంజీవి ఇప్పుడు చరిత్రలో ఒక పేజీ కాదు .. ఆయనే ఒక చరిత్ర. ఆయనకి ప్రవాహంలా పరిగెత్తడం తెలుసు .. మేరు శిఖరంలా నిబ్బరంగా నిలబడటమూ తెలుసు. చిరంజీవి మెగాస్టార్ గా మారడానికి కొనసాగించిన అలుపెరగని పోరాటం, యువతలో ప్రతి ఒక్కరికీ ఆదర్శమే. కృషి – పట్టుదల కలిస్తే చిరంజీవి .. కృషి పట్టుదల గెలిస్తే మెగాస్టార్ అని చెప్పుకోక తప్పదు. అలాంటి మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుయజేస్తోంది. ప్రజా జ్యోతి టీం

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *