కరీంనగర్ లో స్వీట్ షాప్స్ పై ఫుడ్ సేఫ్టీ విభాగం తనిఖీలు
కరీంనగర్ బ్యూరో, ఆగస్టు 20, (ప్రజాజ్యోతి)
రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు కరీంనగర్ పట్టణంలోని పలు స్వీట్ షాప్స్ పై బుధవారం ఆహార భద్రత విభాగం అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఖలీల్, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్ రెడ్డి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్ రెడ్డి పాల్గొన్నారు. నగరంలోని టవర్ సర్కిల్ వద్ద అనిల్ స్వీట్స్ & బేకరి, ఆనంద్ స్వీట్స్, అలాగే ముకరంపురలోని మహారాజా స్వీట్స్ పై తనిఖీలు నిర్వహించారు.తనిఖీల్లో అధికారులు పలు లోపాలను గుర్తించారు. స్వీట్స్ తయారు చేసే కిచెన్లో అపరిశుభ్రంగా ఉండటం, తయారుచేసిన స్వీట్స్ సరైన రీతిలో భద్రపరచకపోవడంతో వాటిపై ఎలుకల మలం గుర్తించబడింది. కిచెన్లలో డ్రైనేజీలు బ్లాక్ అయి దుర్వాసనతో నిండివుండటం, నిల్వ ఉంచిన పాలలో ఈగలు, దోమలు పడటం, పరిమితికి మించి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడటం వంటి అంశాలను అధికారులు గుర్తించారు.
తయారీ సిబ్బంది ఎటువంటి భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం కూడా గమనించబడింది. దీంతో ఆనంద్ స్వీట్స్, మహారాజా స్వీట్స్ లో ఉన్న నాసిరకం స్వీట్స్ ను వెంటనే పారవేశారు. ఆనంద్ స్వీట్స్ లో 20 లీటర్ల పాలు, మహారాజా స్వీట్స్ లో 10 కిలోల బాదుషా, 3 కిలోల ఖారాను అధికారులు వెదజల్లించారు.తదుపరి చర్యల కోసం గుర్తించిన స్వీట్స్ నుండి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపినట్టు అధికారులు తెలిపారు.