హైదరాబాద్ నగర కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసేలా ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం ఒక పండుగలా కాకుండా, నగరం బ్రాండ్ ఇమేజ్‌ను పెంచే గొప్ప వేడుకగా దీనిని తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఈ మేరకు 2025 వినాయక చవితి ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ సన్నాహక సమావేశానికి నగర మేయర్ విజయలక్ష్మి, డీజీపీ జితేందర్‌రెడ్డితో పాటు మూడు కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు, ఖైరతాబాద్, బాలాపూర్ ఉత్సవ సమితుల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఉత్సవాల నిర్వహణను మూడు విభాగాలుగా విభజించి సమీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. విగ్రహాల ఏర్పాటు, పూజల నిర్వహణ, నిమజ్జనం అనే మూడు దశల్లోనూ పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నట్లు స్పష్టం చేశారు. వేడుకలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేందుకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు, ప్రజలు ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.
నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సుమారు లక్ష వరకు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, ఈ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మండపాల వద్ద పారిశుద్ధ్య సమస్యలు రాకుండా చూడటంతో పాటు, హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం పూర్తయిన వెంటనే వ్యర్థాలను తొలగించాలని శానిటేషన్ విభాగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.