బ్యాంకుల్లో సమర్పించిన చెక్కులు క్లియర్ కావడానికి ప్రస్తుతం రెండు పని దినాల వరకు సమయం పడుతుండగా, దానిని గంటల వ్యవధిలోకి తగ్గించేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నూతన వ్యవస్థను తీసుకువచ్చింది. అక్టోబర్ 4 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇందుకోసం ప్రస్తుతం అమలులో ఉన్న చెక్ ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్)లో మార్పులు చేయనున్నారు.
దీంతో చెక్కు జమ చేసిన గంటల వ్యవధిలోనే క్లియర్ అవుతుంది. వ్యాపార వేళల్లో చెక్కుల స్కానింగ్, సమర్పణ, క్లియరింగ్ నిరంతరాయంగా సాగుతాయని ఆర్బీఐ తెలిపింది. రెండు దశల్లో ఈ సిస్టమ్ అమల్లోకి వస్తుందని చెప్పింది. మొదటి దశ అక్టోబర్ 4 నుంచి, రెండో దశ 2026 జనవరి 3 నుంచి నిరంతర క్లియరింగ్, సెటిల్ మెంట్ జరుగుతుందని తెలిపింది