ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని బాలానగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సీఐ టి. నర్సింహరాజు వివరాలు వెల్లడించారు.
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన హరికృష్ణ (21) డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. అతనికి ఐదు నెలల క్రితం కుత్బుల్లాపూర్ ప్రాంతానికి చెందిన, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక (16)తో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది అని సీఐ తెలిపారు.
ఈ క్రమంలో జూన్‌లో హరికృష్ణ బాలికను ఐడీపీఎల్ టౌన్‌షిప్‌కు రమ్మని చెప్పాడు. అక్కడకు చేరుకున్న బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇటీవల బాలిక వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించగా, గర్భవతి అని తేలింది. దీంతో తల్లిదండ్రులు నిలదీయగా, బాలిక హరికృష్ణ గురించి చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు హరికృష్ణను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.