పెద్దమ్మ గుడిలో కుంకుమార్చనకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
ఇటీవల ధ్వంసమైన ఆలయాన్ని సందర్శించాలని బీజేపీ నేతల నిర్ణయం
హర్ ఘర్ తిరంగా యాత్రకూ ఆటంకం
ప్రభుత్వ తీరుపై బీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును పోలీసులు ఈ ఉదయం ఆయన నివాసంలోనే గృహ నిర్బంధం చేశారు. బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడికి వెళ్లకుండా అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకున్నారు.
కొద్ది రోజుల క్రితం దుండగులు ధ్వంసం చేసిన బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిలో కుంకుమార్చన చేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామచందర్‌రావు వెళ్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా ఆయనను ఇంటి నుంచి బయటకు రానీయకుండా నిర్బంధించారు. ఈ పరిణామంతో ఆయన సికింద్రాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన ‘హర్ ఘర్ తిరంగా’ యాత్రకు కూడా ఆటంకం ఏర్పడింది.
రామచందర్‌రావు గృహ నిర్బంధాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల నాయకులను అణచివేయాలని చూడటం దురదృష్టకరం. నిర్బంధాలతో కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం” అని అన్నారు.
గత ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనలో తేడా కనిపించడం లేదని ఆయన విమర్శించారు. ముందస్తు అరెస్టులు చేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపడతామని మనోహర్రెడ్డి హెచ్చరించారు.