హైదరాబాద్‌లో వర్షాకాలం వచ్చిందంటే చాలు నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పవు. చిన్నపాటి వానకే రహదారులు చెరువులను తలపించడం, గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడం సర్వసాధారణం. ఈ తీవ్రమైన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రోడ్ల కింద భారీ భూగర్భ నీటి సంపులను (రెయిన్ వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్స్) నిర్మిస్తూ ఒకే దెబ్బకు రెండు ప్రయోజనాలను సాధిస్తోంది.
ఈ భూగర్భ సంపుల నిర్మాణం ద్వారా ప్రభుత్వం బహుళ ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుంది. వర్షం పడినప్పుడు రోడ్లపై నిలిచే నీరంతా నేరుగా ఈ సంపులలోకి చేరుతుంది. దీంతో రోడ్లపై నీరు నిలవకుండా ట్రాఫిక్ సాఫీగా సాగిపోతుంది. అదే సమయంలో సంపులలో చేరిన నీటిని ప్రత్యేక ఇంజక్షన్ బోర్ల ద్వారా భూమిలోకి ఇంకేలా చేస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ విధంగా, ఒకే నిర్మాణంతో తక్షణ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం, దీర్ఘకాలికంగా పర్యావరణానికి మేలు జరుగుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నగరంలో తరచూ నీరు నిలిచే ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ అధికారులు గుర్తించారు. మొత్తం 144 ప్రాంతాల్లో వరద సమస్య ఉన్నట్టు తేల్చగా, వాటిలో 50 చోట్ల పరిస్థితి తీవ్రంగా ఉంది. సమీపంలో నాలాలు, చెరువులు ఉన్నచోట నీటిని అటువైపు మళ్లిస్తుండగా, ఆ సౌకర్యం లేని చోట్ల ఈ భూగర్భ సంపులను నిర్మిస్తున్నారు.
మొదటి విడతలో భాగంగా 23 ప్రాంతాలను ఎంపిక చేయగా, రూ.13.99 కోట్ల వ్యయంతో 11 చోట్ల పనులు ప్రారంభించారు. వీటిలో 10 నిర్మాణాలు ఇప్పటికే పూర్తి కాగా, మరొకటి తుది దశలో ఉంది. మిగిలిన 12 ప్రదేశాల్లో భూగర్భంలో కేబుళ్లు, పైపులైన్లు ఉండటంతో నిర్మాణం సాధ్యపడలేదు. అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి 15 నుంచి 20 అడుగుల లోతుతో, 2.65 లక్షల నుంచి 10.4 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఈ సంపులను నిర్మిస్తున్నారు.
ఈ ప్రయోగం ఇప్పటికే పలు కీలక ప్రాంతాల్లో సత్ఫలితాలనిస్తోంది. గతంలో వర్షం పడినప్పుడల్లా సచివాలయం ఎదుట, సోమాజిగూడ కేసీపీ జంక్షన్ వద్ద, రాజ్‌భవన్ సమీపంలో, పీవీ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 264 వద్ద రెండు, మూడు అడుగుల మేర నీరు నిలిచి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు ఈ ప్రాంతాల్లో భూగర్భ సంపుల నిర్మాణంతో ఆ సమస్య దాదాపుగా పరిష్కారమైందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, మరిన్ని అనువైన ప్రాంతాలను గుర్తించి సంపుల నిర్మాణం చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ అధికారులను తాజాగా ఆదేశించారు.