దర్శకుడు, నటుడు ఆర్. నారాయణమూర్తిపై సీనియర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నారాయణ మూర్తి కొత్త చిత్రం ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ను ప్రసాద్ ల్యాబ్స్‌లో త్రివిక్రమ్ వీక్షించారు. అనంతరం నారాయణ మూర్తిపై త్రివిక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సినీ పరిశ్రమలో నారాయణ మూర్తిది సుదీర్ఘ ప్రయాణమని ఆయన అన్నారు. ఆయన వన్ మ్యాన్ ఆర్మీ అని, ఆయన సినిమాల్లో రాజు ఆయనే, సైన్యాధిపతి ఆయనేనని అన్నారు. కథాలోచన నుంచి సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకువెళ్లే వరకు ఒక్కరే ప్రయత్నిస్తారని అన్నారు. ఆర్. నారాయణ మూర్తి ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక ప్రయోజనం ఉండాలని అనుకుంటారని తెలిపారు.
అణచివేతకు గురైన వారి తరపున మాట్లాడేందుకు ఒక గొంతుక ఉందని, అది అందరికీ వినపడాలన్నారు. అయితే అది మనకు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చని, కానీ ఇలాంటి వారు మాట్లాడాల్సిన అవసరం ఉందని, లేదంటే ప్రపంచంలో ఏకపక్ష ధోరణి నెలకొంటుందని త్రివిక్రమ్ అన్నారు.
రాజీ పడకుండా బతకడం అందరికీ సాధ్యం కాదని, తాను చాలాసార్లు రాజీ పడ్డానని అన్నారు. ఒక సినిమాలోని పాత్ర కోసం తాను నారాయణ మూర్తిని అనుకున్నానని, కానీ పారితోషికంతో ఆయనను కొనలేమని ఎవరో చెప్పారని అన్నారు.