ఈ రోజు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా, నగరంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. మీర్‌పేట, మిథిలా నగర్‌లలో నడుము లోతు వరకు వరద నీరు నిలిచింది. బాలాజీ నగర్, సత్యసాయి నగర్‌లలో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద వెళ్లే మార్గం లేక రోడ్లపైనే నీరు నిలిచిపోయింది.