యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ‘వార్-2’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకకు రంగం సిద్ధమైంది. అట్టహాసంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి (కేవీబీఆర్) ఇండోర్ స్టేడియం ఈ వేడుకకు వేదిక కానుంది.
సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుక రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇద్దరు అగ్ర తారలు ఒకే వేదికపై కనిపించనుండటంతో ఈ కార్యక్రమానికి అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ‘వార్-2’ వేడుక కారణంగా కేవీబీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉందని వెల్లడించారు. అందువల్ల, ఆదివారం సాయంత్రం సమయంలో ప్రయాణికులు యూసుఫ్‌గూడ మార్గంలో కాకుండా ప్రత్యామ్నాయ దారుల్లో ప్రయాణించాలని సూచించారు. అనవసరమైన అసౌకర్యాన్ని నివారించేందుకు వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు