సీఎంసీలో దొంగలు పడ్డారు.. అదిలోనే అక్రమాలు నియామకాల్లో అవకతవకలు అనర్హులకు పోస్టులు… పోలీసు స్టేషన్లో పంచాయతీ…

Nizamabad Bureau Sanjeev Yedla

సీఎంసీలో దొంగలు పడ్డారు..

అదిలోనే అక్రమాలు

నియామకాల్లో అవకతవకలు

అనర్హులకు పోస్టులు

పోలీసు స్టేషన్లో పంచాయతీ

నిజామాబాద్ రూరల్, ప్రజాజ్యోతి :

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి లో గల సీఎంసీ మెడికల్ కాలేజ్ ఏర్పాటు ఆదిలోనే హంసపాదు అన్నట్లు ఉంది. ఐఎఎస్ క్యాడర్ కు చెందిన రిటైర్డ్ అధికారులు కొందరు కలిసి మెడికల్ కాలేజ్ తెరిచారు. అక్టోబర్ 2024లో ప్రారంభించారు. ముందుగా ఆసుపత్రి ప్రారంభం చేసేందుకు నిజామాబాద్ కు చెందిన వైద్యునికి అప్పగించారు. ఇక్కడే అసలు తంతు మొదలు అయింది. కాలేజ్ మేనేజ్మెంట్ కమిటీ మొత్తం నాన్ లోకల్ కు చెందిన వారు కావడంతో స్థానిక వైద్యులు ముగ్గురిది ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. నియమాకాల నుంచి మొదలు పెడితే మేనేజ్మెంట్ వరకు అన్నితామై “మేనేజ్” మెంట్ చేసారు. నియామకాల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. వైద్యులు, సహాయ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారిష్యుద్ద సిబ్బంది, పాలన సిబ్బందిని నియమించారు. ఇందులో ఏ ఒక్క నియమాకానికి మేనేజ్మెంట్ అనుమతులు లేకపోవడం విశేషం. ముఖ్యముగా మేనేజ్మెంట్ కమిటీ హైదరాబాద్ లో ఉండటంతో నియామకాలు ఒక్కటి కూడా వైద్యశాఖ నిబంధనల మేరకు జరగలేదు. ఇందులో కొంత వైద్యులు నకిలీ వారు ఉండటం విశేషం. కొందరికి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి లో కూడా లేని వారిని ప్రొఫెసర్ గా నియమించారు. అర్హత లేని వారిని నియమించడంతో అసలు సమస్య మొదలు అయింది. దింతో మేనేజ్మెంట్ కు నియామకాలు చెపట్టిన వైద్యులకు మధ్య విభేదాలు వచ్చాయి. కాలేజ్ ఛైర్మెన్ షణ్ముఖలింగం హైఫవర్ కమిటీకి ఫిర్యాదు చేసారు. హైఫవర్ కమిటీ విచారణ చేసి బోగస్ నియామకాలను గుర్తించి తొలగించారు. ఇక్కడ అసలు కథ మొదలు అయింది.

డైరెక్టర్ అయిన డాక్టర్…

రూ.5 కోట్ల చెక్కులు ఇచ్చి సీఎంసీలో డైరెక్టర్ గా చేరారు ఓ వైద్యుడు. వృత్తి వైద్యుడు కావడంతో కాలేజ్ లో ప్రొఫెసర్ గా చేరాలని వెళ్లారు. కానీ అక్కడి పరిస్థితిని పసిగట్టి ఏకంగా ఛైర్మెన్ షణ్ముఖలింగంతో చర్చించి మేనేజ్మెంట్ చెరెందుకు అవకాశం కోరారు. అందుకు రూ.5 కోట్ల చెక్కులను సీఎంసీ (ఐఎంఆర్సీ) పేరుతో ఇచ్చారు. ఇలా సదరు వైద్యుడు ఈ చెక్కుల పేరుతో సీఎంసీ డైరెక్టర్ గా చేరారు. డైరెక్టర్ గా చేరడం ఆలా ఉంటే వైద్యులు గా నియామకం అయిన 15 రోజుల్లో అర్హత సర్టిఫికెట్లు మేనేజ్మెంట్ కు ఇవ్వాలి. ఆ తరువాతనే పూర్తి భాద్యతలు చేపట్టాలి. కానీ ఇప్పటి వరకు సర్టిఫికెట్లను మేనేజ్మెంట్ కు ఇవ్వలేదు. ఇవేవి చెయ్యని ముగ్గురు వైద్యులు ఏకంగా ఆసుపత్రిని చేతుల్లోకి తీసుకోని నిబంధనలకు వ్యతిరేకంగా నియామకాలు చేసారు. డైరెక్టర్ పోస్టులో ఉండటంతో సదరు డాక్టర్ ను అందరు నమ్మారు. మరోవైపు ఆ వైద్యుడే ముఖ్యమైన వైద్యుల సంఘంలో ముఖ్య పదవిలో ఉండటంతో మరింత కలిసి వచ్చింది. ఇలా సీఎంసీలో పెట్టుబడుల పేరుతో, నియామకాల పేరుతో సుమారు రూ. 3 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలిసింది. అయితే ఈ డబ్బు సీఎంసీ కాలేజ్ అకౌంట్ లోకి వెళ్ళలేదు. మరి ఎటు వెళ్ళింది.? ఎవరి జేబులోకి వెళ్ళింది.? ఏం చేసారు అనే రహస్యం ఆ ముగ్గురు వైద్యులకే తెలియాలి. ఇప్పుడు ఈ వివాదం ముదిరి పాకనా పడటంతో సదరు వైద్యుడిని నమ్మి డబ్బులు పెట్టిన వైద్యులు కిమ్మనకుండా ఉన్నారు. ఈ వివాదం ముదిరి ఎవరిపై పడుతుందోననే భయంలో ఉన్నారు.

వేతనాల పేరుతో వివాదం…

అయితే నిబంధనలకు విరుద్దంగా నియామకాలు జరిగిన వారి వేతనాలు మేనేజ్మెంట్ కమిటీ చెల్లించడం లేదు. ఇలా గత మూడు నెలలుగా వేతనాలు లేక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళనను అడ్డం పెట్టుకున్న కొందరు వైద్యులు మరింత వివాదం చేసి తమ పబ్బం గడుపుకునేందుకు పావులు కడుపుతున్నారు. వాస్తవానికి పారిశుధ్య సిబ్బందికి వేతనాలు చెల్లించాలి. వేతనాలు రాకపోవడంతో సిబ్బంది నియమించిన వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యంగా వైద్యులు, నర్సింగ్ స్టాప్, టెక్నీకల్ సిబ్బంది నియామకంలో వైద్యశాఖ నిబంధనలు తప్పనిసరి పాటించాలి. కానీ ఇక్కడ అవేవి అమలు కాకపోవడంతో వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని మేనేజ్మెంట్ తెలిపారు.

పోలీసుల చేతిలోనే పంచాయతీ…

డిచ్పల్లి సీఏంసీ మెడికల్ కాలేజ్ డబ్బుల వివాదం పోలీసుల చేతిలోకి వెళ్ళింది. వివాదం మొదలు కావడంతో కాలేజ్ ఛైర్మెన్ షణ్ముఖ లింగం గత నెల 5న డిచ్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. మరోసారి వివాదం కావడంతో మరోసారి గత నెల 8న ఫిర్యాదు చేసారు. అలాగే భద్రత కల్పించాలని పోలీస్ ఉన్నత అధికారులకు విన్నవించారు. కానీ ఇవేవి ముందుకు పడలేదు. కానీ చెక్కుల భాగోతం నడిపిన వైద్యుడు పోలీసులకు 13న ఫిర్యాదు చేయడంతో వెంటనే పోలీసులు కేసు నమోదు చేసారు. పెట్టుబడులు, వేతనాల డబ్బు రూ. 2 కోట్లతో ఛైర్మెన్ పరారీ అయ్యారని ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. విషయం తెలుసుకున్న సీఎంసీ మేనేజ్ మెంట్ కమిటీ సీపీ సాయిచైతన్యను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దింతో స్పందించిన సీపీ ప్రస్తుతం ఈ కేసుపై లోతుగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *