రాఖీ పౌర్ణమి పండగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. పండగ రద్దీ కారణంగా శనివారం ఉదయం నుంచే రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ నగర శివార్లలోని వనస్థలిపురం, భాగ్యలత, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఒక్కసారిగా వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి రావడంతో ప్రధాన రహదారితో పాటు సర్వీసు రోడ్లు కూడా వాహనాలతో నిండిపోయాయి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది.
మరోవైపు, ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. పండగ రద్దీ కారణంగా ఇక్కడ ట్రాఫిక్ దాదాపుగా స్తంభించిపోవడంతో, వాహనాలు ముందుకు కదలలేని దుస్థితి ఏర్పడింది. ఈ ఊహించని ట్రాఫిక్ జామ్ వల్ల గంటల తరబడి ప్రయాణం సాగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. తమ గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.